
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. కనకదుర్గ కుటుంబం.. కావ్య, సుధీర్‌కుమార్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన పి.సుబ్బలక్ష్మి పేరిట కుమారుడు, కోడలు శివశంకర్, విజయదుర్గ నిత్యాన్నదానానికి రూ. 1,00,111 విరాళాన్ని అందజేశారు.
ఉచిత ప్రసాద వితరణకు ..
హైదరాబాద్‌కు చెందిన కేవీ లక్ష్మీ నరసింహశాస్త్రి, పద్మావతి దంపతులు కుమారుడు సునీల్‌చంద్ర, ఫణిశ్రీల పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,001 విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ. 1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ
లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరి గింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు సేవలో పాల్గొన్నారు.ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది.
ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో కీలకమైన క్యూలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటుతో పాటు ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు, అన్నదాన భవనం పనుల పురోగతిపై చర్చించారు. శుక్రవారం జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు.

దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు