
బస్‌స్టాండ్‌లో ప్రసాదాల కౌంటర్‌కు కరెంట్ సరఫరా కట్..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లో సిటీ బస్ టెర్మినల్ వద్ద దుర్గగుడి ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్‌కు విద్యుత్‌ను ఆర్టీసీ అధికారులు కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ప్రసాదాల కౌంటర్‌కు ఆర్టీసీ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికి దేవస్థానం ప్రతి నెలా విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. అయితే కొన్ని నెలలుగా దేవస్థానం ప్రసాదాల కౌంటర్ విద్యుత్ బిల్లును చెల్లించకపోవడంతో అది కాస్త రూ. 18 వేలకు చేరింది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఆర్టీసీ అధికారులు కౌంటర్‌లోని సిబ్బందికి తెలియజేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కౌంటర్‌లోని సిబ్బంది దేవస్థాన అధికారులకు చెప్పినా ఎటువంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారు. దీంతో ప్రసాదాల కౌంటర్‌లో కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు పని చేయడం లేదు. ప్రసాదాలు కొనుగోలు చేసే భక్తులకు తొలుత కంప్యూటర్ టోకెన్ ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యుత్ లేకపోవడంతో టోకెన్లు లేకుండానే ప్రసాదాల విక్రయాలు జరుగుతున్నాయి. మరో వైపు చీకట్లోనే బ్యాంక్ సిబ్బంది పని చేస్తూ భక్తులకు, ప్రయాణికులకు ప్రసాదాలను విక్రయిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరు సరికాదని పలువురు భక్తులు, యాత్రికులు అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్ బిల్లు బకాయి కోసం ఆర్టీసీ చర్య