
ఎన్టీటీపీఎస్ ప్లాంట్‌లో బూడిద లారీ బోల్తా
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ ప్లాంట్‌లో బూడిద రవాణా చేసే ట్యాంకర్ లారీ శనివారం రాత్రి బోల్తా పడింది. జగ్గయ్యపేట సమీపంలోని సిమెంట్ ఫ్యాకర్టీలకు బూడిద తరలించే నేపథ్యంలో మద్యం మత్తులో లారీతో ప్లాంటులోకి డ్రైవర్ ప్రవేశించడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్లాంటులో 20కేఎం వేగానికి మించి వాహనం నడిపే అవకాశం లేకపోయినా ప్రమాదం జరగడానికి మద్యం మత్తే కారణంగా తేల్చారు. లారీలు పార్కింగ్ చేసే సమీపంలో మద్యం బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవర్లు మద్యానికి బానిసలై వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. ఉద్యోగులను క్షుణంగా పరిశీలించే సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్లను ఎందుకు తనిఖీ చేయడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.