
లాటరీలో 62 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 62 బార్లకు శనివారం లాటరీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ అబ్కారీ అధికారి వి.శ్రీనివాసరావుతో కలిసి దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీశారు. జిల్లా ప్రొహిబిషన్ అబ్కారీ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతన పాలసీలో భాగంగా మూడేళ్ల కాలపరిమితికి జిల్లాలో సాధారణ కేటగిరీలో 130 బార్లు, గీత కులాలకు 10 బార్లు చొప్పున కేటాయించామన్నారు. నిర్దేశించిన గడువు తేదీలోగా ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే 262 దరఖాస్తులు వచ్చాయన్నారు. 55 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చిన 62 బార్లను లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించామని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్‌కు రెండు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. నాలుగు కంటె తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచుతామన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలవని 55 బార్లకు ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. గీత కులాల కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు 104 దరఖాస్తులు అందాయన్నారు. అత్యధికంగా గెజిట్ నంబర్లు 6,7లకు 13 చొప్పున, అత్యల్పంగా గెజిట్ నంబరు 10 బార్ (కొండపల్లి)కి ఆరు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గీత కులాల వారికి కూడా గెజిట్ సీరియల్ నంబరు ప్రకారం కలెక్టర్ లక్ష్మీశ పారదర్శ కంగా లాటరీ తీశారు. ఈ పది బార్లకు లాటరీ ద్వారానే మరో ఇద్దరు వ్యక్తులను రిజర్వుడ్ –1, రిజర్వుడ్ –2గా నిర్ణయించినట్లు తెలిపారు. లాటరీలో బార్లు దక్కించుకున్న వారందరూ నిర్ణయించిన వార్షిక లైసెన్సు ఫీజులో ఆరో వంతు సొమ్ము ప్రభుత్వానికి చలానాగా చెల్లించాల్సి ఉంటుందని, నూతన బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.