
పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకుల బాహాబాహీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట): స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ సర్పంచ్ మల్లెల శివపై జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన అదే పార్టీ యూత్ నాయకుడు ఎనికె గోపీ సోషల్ మీడియాలో కొంత కాలంగా అనుచిత పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అధిష్టానం దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో రాజీ చేశారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో శివ భార్య సబిత జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు మీదుగా మక్కపేటకు కారులో వెళ్తుండగా మెయిన్ రోడ్డు పక్కన పోలీస్ స్టేషన్ వద్ద గోపీ ఉండటాన్ని చూశారు. తన భర్తపై అనుచిత పోస్ట్‌లు ఎందుకు పెడుతున్నావని ఆమె గోపీని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడికి రావడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు ఆ ప్రాంతం అంతా బూతుపురాణాలతో దద్దరిల్లింది. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు కూడా నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. చివరుకు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు.