
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఆయన శనివారం ఉత్సవాల సందర్భంగా చేయనున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపైన ఏర్పాటు చేయనున్న క్యూలైన్‌లు, ఘాట్‌రోడ్డు తదితర ప్రాంతాలను నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినాయక టెంపుల్ వద్ద నుంచి ఏర్పాటు చేసే క్యూలైన్‌లను పరిశీలించి తగు సూచనలు చేశారు. క్యూలైన్‌లలో ఏఏ ప్రదేశాల్లో బారికేడింగ్ చేయాలి, హోల్డింగ్ చేయాలి, హోల్డింగ్ ప్రదేశాల్లో భక్తులు లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఏర్పాట్లు వంటి అంశాలపై సూచనలు చేశారు. దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమజోన్ ఇన్‌చార్జి డీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
దసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన
సీపీ రాజశేఖరబాబు