
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. తొలుత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నిర్వహించే బీఆర్‌ఏపీ–2024 సర్వేపై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే విధానాన్ని, పారామీటర్‌లను క్షుణ్ణంగా వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ర్యాంకింగ్‌ను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి శాఖ తమ శాఖ ద్వారా సేవలు పొందిన వారికి సింగిల్ విండో వ్యవస్థతో పాటు వివిధ ఆన్‌లైన్ సేవలు వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 29 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 2,958 దరఖాస్తులు రాగా 2,921 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద పది క్లెయిమ్‌లకు రూ.1.52 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపింది. 2025–26కు సంబంధించి పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్‌ఫార్మెన్స్ (ర్యాంప్)కు సంబంధించి మండల ప్రధాన కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు, సర్వీస్ యూజర్లు పాల్గొన్నారు.