
ఆధునిక వైద్య విధానాలను అందిపుచ్చుకోవాలి
●సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ ఏడుకొండలరావు
●పల్మనాలజీ విభాగం రాష్ట్ర స్థాయి సీఎంఈ నిర్వహణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్యాసకోశ వ్యాధులకు సంబంధించి అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్సా విధానాలను పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో పల్మనరీ మెడిసిన్ పీజీ విద్యార్థుల కోసం రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు శనివారం ప్రారంభమైంది. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సును డాక్టర్ ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీలు పరీక్షల ప్రిపరేషన్, రోగులతో ప్రవర్తన, నైతిక విలువలు, నీతి, కష్టపడే తత్వం, నిజాయతీ వంటి అంశాలను వివరించారు. అనంతరం లాంగ్ కేస్, షార్ట్‌కేస్ ప్రజెంటేషన్, ఓఎస్‌సీఈ, వైవా ప్రిపరేషన్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బాబూరావుతో పాటు కొందరు ఫ్యాకల్టీ సభ్యులు ఈ సదస్సులో పలు విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈ ఏడాది అక్టోబరులో యూనివర్సిటీ తుది పరీక్షలు రాయనున్న 100 మంది పల్మనరీ మెడిసిన్ పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సును పల్మనరీ మెడిసిన్ విబాగాధిపతి డాక్టర్ సుధీన, ఇతర అధ్యాపకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.