
క్రీడల్లో ప్రతిభ చూపుతున్న జిల్లా పాఠశాలలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): క్రీడా రంగంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నాయని జిల్లా పాఠశాల విద్యాశాఖ జోన్–2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కాకినాడ) జి.నాగమణి అన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఈవో కార్యాలయంలో ప్రతిభ చూపిన పాఠశాలల క్రీడా విభాగ ఉపాధ్యాయులను, విద్యార్థులను శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నున్న జిల్లా పరిషత్ పాఠశాల రాష్ట్రంలోనే అత్యధికంగా 1347 పాయింట్లను సాధించి క్రీడల్లో తొలి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు పలు క్రీడాంశాల్లో అద్భు తమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని అభినందించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి నున్న జెడ్పీ పాఠశాల ప్రథమస్థానం, పటమట కేబీసీ జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ, దుర్గాపురం ఎస్టీవీఆర్‌ఎంసీ హైస్కూల్ తృతీయ, నిడమానూరు జెడ్పీ హైస్కూల్ నాలుగో స్థానం, కొత్తపేట హిందూ హైస్కూల్ ఐదో స్థానంలో ఉన్నట్లు వివరించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన హెచ్‌ఎంలను, పీఈటీలను సత్కరించారు.
ఏపీలో తొలి స్థానంలో నిలిచిన నున్న జెడ్పీ పాఠశాల