
విజయవాడలో బల్లెంవారి వీధి నుంచి పోరంకి వెళ్లే దారి ఇలా..
విజయవాడలో మూడు రోడ్డు పనుల టెండర్లు రద్దు
మూడుసార్లు వాయిదాలు వేసి చివరికిలా..
కారణాలు వెల్లడించని ఏపీ సీఆర్డీఏ
రద్దు రహస్యం... అయిన‘వారికి’ కట్టబెట్టేందుకేనా?
సాక్షి, ప్రత్యేకప్రతినిధి: విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు ఏపీ సీఆర్డీఏ ఫుల్‌స్టా్‌ప్ పెట్టింది. రూ.75 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన సర్కారు వాటిని అర్ధాంతరంగా రద్దుచేసింది. టెండర్లను రద్దు చేయడానికి కారణాలేంటో కూడా వెల్లడించలేదని టెండరుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోడ్డు పనులు పూర్తయితే తమ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గుతుందని ఆశించిన విజయవాడ ప్రజలకు, ఆ మార్గాల్లో వాహనచోదకులకు నిరాశే మిగిలింది.
గత నెలలో టెండర్లు
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు రాజధాని అమరావతిలో పది పనులను చేపట్టడానికి గత నెలలో ఏపీ సీఆర్డీఏ రూ.793.21 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలి సిందే. ఇందులో ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు ఉండగా తక్కిన మూడు టెండర్ల్లు సేవలకు సంబంధించినవి. వీటిలో రూ.683.33 కోట్లతో రాజధానిలో వివిధ పనులు కాగా రూ.109.88 కోట్లతో విజయవాడ, గుంటూరులో నాలుగు రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణ, నిర్వహణ పనుల టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీ లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని, నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయవచ్చని నోటీసులో పేర్కొనడం విదితమే.
● విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు (హెచ్‌టీ లైన్ రోడ్) బీటీ హాట్ మిక్స్‌తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ తదితర పనులకు 26,51,89,656 రూపాయలతో, మహానాడు రోడ్డు.. బల్లెంవారి వీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకు 25,52,45,567 రూపాయలతో, బందరు రోడ్డు నుంచి హెచ్‌టీ లైన్ జంక్షన్ వరకు బల్లెంవారివీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనుల నిమిత్తం 22,96,21,066 రూపాయలతో టెండర్లను జూలైలో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెండర్‌లో పేర్కొన్న విధంగా ఈ మూడు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌లను ఈనెల 11వ తేదీ తెరవాల్సి ఉంది. సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ఏ కారణం చెప్పకుండానే బిడ్ తెరవలేదు. 19వ తేదీ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తున్నట్లు ఆ సమయంలో పేర్కొన్న అధికారులు ఆ పని కూడా చేయకపోగా 29వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా టెండరు ఐడీ 832663ని క్యాన్సిల్డ్/రిజెక్టెడ్ అని శుక్రవారం ఏపీ సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ తెలియజేశారు.
మూడు సార్లు వాయిదాలెందుకు? ఇప్పుడు రద్దేల?
విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేయకపోగా మూడు పర్యాయాలు వాయిదా వేసి చివరకు ఎందుకు రద్దు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టెండరు ఆహ్వానదారు పరిపాలనా కారణాల పేరిట ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దాదాపు నెలకు పైగా టెండరు వ్యవహారాలు నడిపి, టెక్నికల్ బిడ్ తెరవడానికి మూడుసార్లు వాయిదాలు వేసి చివర్లో రద్దు చేయడం ఏంటనేదే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రశ్న.
కనీసం సహేతుక కారణమైనా ఉండాలి కదా అంటున్నారు. అన్ని పనులను కలిపి పెద్దమొత్తంతో టెండర్ ఆహ్వానించి రాజధాని అమరావతిలో మాదిరి బడా కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టడానికి తాజా టెండర్లను రద్దు చేసి ఉండవచ్చనే అనుమానాలను కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తుండటం పరిశీలనాంశం. అందువల్లే వాయిదాలు వేసి చివరకు టెండర్లనే రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిడ్ తెరవలేదు
గుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ కింద నిర్మాణానికి రూ.34,87,28,545 టెండరు పిలిచిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఏడో తేదీ టెక్నికల్ బిడ్ తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు అధికారులు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవాలి. కానీ ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. రాజధాని అమరావతిలో వివిధ పనులకు రూ.683.33 కోట్లతో పిలిచిన టెండర్ల అంశం ఇంకా తేల్లేదు.
నిత్యం తీవ్ర ఇబ్బందులే
ట్రాఫిక్‌తో విజయవాడ నగర ప్రజానీకం నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత మూడు రోడ్ల విస్తరణ పనులు జరిగినట్లయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలతో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పలు కాలనీలకు, గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గంగా, అదనపు సౌకర్యంగా ఉండేది. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత హాస్పటల్ జంక్షన్, రామవరప్పాడు రింగ్, నిడమానూరు వరకు ట్రాఫిక్ చెప్ప నలవికాదు. చైన్నె– కోల్‌కతా జాతీయ రహదారి కూడా అయినందున ఈ మార్గంలో భారీవాహనాలు ఎక్కువే. గన్నవరం విమానాశ్రయానికి సమయానికి వెళ్లడానికి ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. టెండర్లలో ప్రతిపాదించిన మూడు మార్గాలు విస్తరణకు నోచుకుంటే మహానాడు మార్గం నుంచి బల్లెంవారివీధి గుండా నిడమానూరు మీదుగా అటు గన్నవరం రోడ్డు, ఇటు కానూరు, పోరంకిల మీదుగా బందరు రోడ్డు, మచిలీపట్నం జాతీయరహదారికి చేరుకోవడానికి అనువైన ప్రత్యామ్నాయాలుగా ఉండేవి. అదేవిధంగా వంద అడుగుల రోడ్డు (కామినేని హాస్పటల్ రోడ్డు)కు చేరుకోవడానికి వీలయ్యేది. అన్నింటికీ మించి రెండు ఆటోనగర్‌ల నుంచి ఊరి వెలుపలికి వెళ్లడానికి, నగరంలోకి రావడానికి భారీ వాహనదారులకు ఉపయోగపడేది. తాజాగా రద్దయిన టెండర్ల అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్ల విస్తరణ పనులు జరిగేలా దృష్టి సారిస్తే ప్రజోపయోగంగా ఉంటుంది.