
వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే!
సెప్టిక్ ట్యాంకుల్లో కెమికల్ వ్యర్థాలను తరలిస్తున్న కంపెనీలు ఏడాదికి పైగా చెరువులు, పంట కాల్వల్లో పారబోస్తున్న వైనం ‘సాక్షి’ వరస కథనాలతో నిఘా పెట్టిన జి.కొండూరు పోలీసులు పోలీసులకు పట్టుబడిన సెప్టిక్ ట్యాంకు
సెప్టిక్ ట్యాంకులే అస్త్రాలుగా..
జి.కొండూరు: మండల పరిధిలో వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే. పోలీసుల నిఘాతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కెమికల్, మడ్డి ఆయిల్, టైర్ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంట పారబోస్తూ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. వినూత్న పద్ధతిలో వ్యర్థాలను బయటకు తరలించి చేతులు దులుపుకొంటున్న కంపెనీలు, వ్యర్థాలు తమవి కావని చెప్పిన బుకాయింపు మాటలు అవాస్తవమని తేలిపోయింది. ‘సాక్షి’ వరస కథనాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో జి.కొండూరు పరిధిలోని గడ్డమణుగు గ్రామ శివారులో కొత్తూరు రోడ్డులో వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కడంతో చేసేది లేక కంపెనీల నిర్వాహకులు ముఖం చాటేశారు.
నిత్యం వివాదమే
కొండపల్లి ఐడీఏలోని కెమికల్ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నిత్యం వివాదంగానే మారుతున్నాయి. ఇక్కడ నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉండగా వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు మూడు, మడ్డి ఆయిల్ కంపెనీలు నాలుగు, టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి. వీటి నుంచి రోజుకు వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిని పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేయడంతో ఈ నీరు వ్యవసాయ భూముల మీదగా ప్రవహిస్తుంది. ఈ కెమికల్ వ్యర్థాల ప్రభావంతో కవులూరు గ్రామానికి చెందిన 600 ఎకరాలు చవుడుబారి పండక రైతులు నష్టపోతున్నారు. వ్యర్థాల కారణంగా కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు పక్షవాతం, ఎలర్జీలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కెమికల్ కంపెనీలకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు.
రీసైక్లింగ్ యూనిట్ కూడా వివాదమే
ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రసాయనిక పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యాన కొండపల్లి సమీపంలోనే రీసైక్లింగ్ యూనిట్‌ను రూ.8కోట్లతో దశాబ్ద కాలం క్రితం నిర్మించారు. ఈ కంపెనీ నిర్మాణం కూడా వివాదంగానే మారింది. జనావాసాలకు సమీపంలో వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ నిర్మించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో పాటు అప్పట్లో ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేస్తూ ఆ యూనిట్‌ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులతో తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఏడాదికిపైగా జరుగుతున్న ఈ దురాగతాన్ని జి.కొండూరు పోలీసులు పసిగట్టడంతో కంపెనీల నిర్వాహకుల తీరు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీలు ప్రాసెసింగ్ అనంతరం విడుదలయ్యే కెమికల్ వ్యర్థాలను తరలించడానికి సెప్టిక్ ట్యాంకులను అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఏడాది కాలంగా కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీల నుంచి లక్షల లీటర్ల కెమికల్ వ్యర్థాలను సెప్టిక్ ట్యాంకుల్లో తరలించి జి.కొండూరు మండల పరిధిలోని పినపాక, ఆత్కూరు, హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు, వెలగలేరు, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు గ్రామాల పరిధిలో చెరువులు, కాల్వల్లో పారబోస్తున్నారు. ఈ దారుణంపై ‘సాక్షి’ కథనాలను ప్రచురించే సమయంలో ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులు కొంతమందిని వివరణ కోరగా పారబోస్తున్న వ్యర్థాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని బుకాయించారు. ఇప్పుడు కెమికల్ వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పోలీసులకు పట్టుబడటంతో తమ దందా బయటపడిందని ముఖం చాటేస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులో వ్యర్థాలను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం
కెమికల్ వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంబడి పారబోస్తూ పర్యావరణ కాలుష్యానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పట్టుబడింది. పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు నమూనాలను తీసుకెళ్లారు. ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులతో మాట్లాడి హెచ్చరించాం. నమూనాల ఫలితాలు రాగానే బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం.
–సతీష్‌కుమార్, ఎస్‌ఐ, జి.కొండూరు

వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే!

వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే!