కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో క్రీడా వసతుల కల్పనకు ఖేలో ఇండియా పథకం కింద నలభై రెండు కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మేజర్ ధ్యాన్‌చంద్, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యాన అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో మహిళల నెట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు భాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఆయన వివరించారు. మాతృ భాషను నిర్లక్ష్యం చేయకుండా ఆంగ్లభాషపై పట్టు సాధించాలన్నారు. వికసిత భారత్ 2047–యువ కనెక్టింగ్ నోడల్ అధికారి ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 18 సార్లు హాకీ రాష్ట్ర జట్టు సభ్యురాలిగా జాతీయ స్థాయిలో పాల్గొన్న జ్యోతిని ఘనంగా సత్కరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి నవీన లావణ్య లత, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ఆచార్య మారుతి, ఫిజికల్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండు కిలోమీటర్లు వాక్‌థాన్ చేశారు.
నూతన బార్లకు దరఖాస్తు గడువు ముగింపు
నేడు 30 షాపులకు జేసీ సమక్షంలో డ్రా
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ల నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో 39 జనరల్ బార్లు, నాలుగు గీత కార్మికులకు కేటాయించిన బార్లు ఉన్నాయి. జనరల్ బార్లకు సంబంధించి 112 దరఖాస్తులు రాగా, గీత కులాలకు కేటాయించిన నాలుగు షాపులకు 39 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక షాపునకు ఒకే దరఖాస్తుదారుడు, నాలుగు దరఖాస్తులను.. 30 షాపులకు మాత్రమే చేశారు. మిగిలిన తొమ్మిది షాపులకు నాలుగు దరఖాస్తులు చొప్పున దాఖలు కాలేదు. ప్రస్తుతం జనరల్ బార్లకు సంబం ధించి 26 షాపులు, గీత కులాలకు చెందిన నాలుగు షాపులకు శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పర్యవేక్షణలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని గంగాధరరావు తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 8 గంటలకే వారికి ఇచ్చిన ఎంట్రీ పాస్ ద్వారా షాపుల వారీగా లాటరీలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.
‘పసుమర్తి’కి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు
కూచిపూడి(మొవ్వ): కూచిపూడి నాట్యాచార్యులు, నాట్య ప్రయోక్త డాక్టర్ పసుమర్తి శేషుబాబు (కూచిపూడి–హైదరాబాద్)ను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు అవార్డు వరించింది. కూచిపూడి నాట్య కళాపీఠం పూర్వ ప్రిన్సిపాల్ పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ పెద్ద కుమారుడు శేషుబాబుకు ఈ అవార్డు వచ్చినట్లు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. అవార్డుతో పాటు రూ.25 వేల నగదు శాలువా మెమొంటో అందజేస్తారని వివరించారు. ఏపీ యువజన అభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు వివిధ కళల్లో నిష్ణాతులైన 14 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి సత్కరించినట్లు వివరించారు.
బ్యారేజీకి వరద తగ్గుముఖం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి 3,08,838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో 2,96, 900 క్యూసెక్కుల వరద దిగువకు వదిలివేస్తున్నారు. మిగిలిన 11,938 క్యూసెక్కులను పంట కాలువలకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీకి 3,98,397 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.