
తెలుగు భాష ఔన్నత్యం చాటాలి
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు భాష ఔన్నత్యం చాటి చెప్పడంలో తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ .. రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో కమ్మనైన తెలుగుకు మించిన భాష మరొకటి లేదన్నారు. గిడుగు రామ్మూర్తి జన్మదినమైన ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా గిడుగు రామ్మూర్తిని పరిగణిస్తారన్నారు. రామ్మూర్తి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాతో కలిపి దాదాపు 15 కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతూ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్యం నుంచే తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం నేర్పించి తెలుగు భాషను భావితరాలకు అందించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని లక్ష్మీశ పిలుపునిచ్చారు. గిడుగు రామ్మూర్తికి నివాళులర్పించిన వారిలో డీఎం అండ్ హెచ్‌వో ఎం.సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్‌డీఎ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.