
మందేసి.. చిందేసి..
మందు, చిందులతో హంగామా కార్లు, బైక్‌లతో రేస్‌లు, విన్యాస్యాలు భయభ్రాంతులకు గురవుతున్న సందర్శకులు ఖిల్లాపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
కొండపల్లి ఖిల్లాపై కుర్రాళ్ల వీరంగం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి ఖిల్లా ప్రాశస్త్యం మసకబారుతోంది. ఎందరో రాజులకు పరిపాలన కేంద్రంగా నిలిచిన ఖిల్లా.. నేడు మందు బాబులకు అడ్డాగా మారింది. కార్ రేస్‌లతో పాటు మందు, విందు, చిందులతో యువకులు ఖిల్లాపై చెలరేగిపోతున్నారు. వినాయక చవితి పర్వదినం రోజు కొందరు యువకులు ఖిల్లాపై వీరంగం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనల చోటుచేసుకోవడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడి మద్యం విక్రయాలే ఇటువంటి ఘటనలకు కారణమని చెబుతున్నారు.
ఒక గ్రూప్‌గా వచ్చి..
వినాయక చవితి పండగ సెలవు రోజున సుమారు 50 మంది యువకులు కొండపల్లి ఖిల్లాపై టూర్ ప్రోగ్రాం నిర్ణయించుకుని ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. ఖిల్లాపైకి చేరుకునే క్రమంలో కొందరు కార్లపైకి ఎక్కి విన్యాసాలు చేశారు. మరికొందరు డోర్‌ల నుంచి బయటకు చూస్తూ హవాభావాలు ప్రదర్శించి ఘాట్ రోడ్డులో ప్రయాణించే ఇతరులను భయభ్రాంతులకు గురిచేశారు. కార్లతో పాటు బైక్‌లపై కూడా రేస్‌లను తలపించే విధంగా సైరన్ వేసి డ్రైవింగ్ విన్యాసాలు చేస్తూ కుటుంబ సభ్యులతో వచ్చిన వారిని భయకంపితులను చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటువంటి ఘటనలతో ఖిల్లాకు పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ శూన్యం..
కొండపల్లి ఖిల్లా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఖిల్లాపై ఒక సూపర్ వైజర్‌తో పాటు గైడ్, టికెట్లు వసూలు, పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరు టికెట్లు వసూలు తప్ప పర్యాటకుల కదలికలపై దృష్టి పెట్టకపోవడం ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఖిల్లాపైకి వివిధ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి సందర్శకులు వస్తారు. వీరితో పాటు ట్రెక్కింగ్ చేసేందుకు పాఠశాలలు, కళాశాల నుంచి విద్యార్థులు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఆర్డీఓ చైతన్య ఇతర అధికారులతో ట్రెక్కింగ్ చేశారు. మందుబాబుల హంగామాతో పర్యాటకులు, ట్రెక్కర్లు సైతం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మందుబాబులపై అధికారులు దృష్టిసారించి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని సందర్శకులు కోరుతున్నారు.
రేవ్ పార్టీ రేంజ్‌లో..
కొండపైకి చేరిన యువకులు ఖిల్లాపై బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి టేబుల్స్ ఏర్పాటు చేసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఖిల్లాపై నానా హంగామా సృష్టించారు. రేవ్ పార్టీ కల్చర్‌ను గుర్తు చేస్తూ చిందులు వేశారు. మద్యం మత్తులో వారిలో వారు వాదులాడుకున్నారు. ఓ దశలో వారిలో వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఖిల్లాపై సరదాగా గడుపుదామని వచ్చిన సందర్శకులు వీరి హంగామా చూసి, హడావుడిగా కొండదిగి వెళ్లిపోయారు.

మందేసి.. చిందేసి..