
108 అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్సే ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎన్‌బీఎస్ పరిసరాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, సంగుల పేరయ్య వీధిలో జల్ది వెంకటేశ్వరరావు(36), భార్య రత్నకుమారి, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బస్టాండ్ వద్ద ఒక కార్ ట్రావెల్స్‌లో గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో అతను నైట్ డ్యూటీలో ఉండగా.. గురువారం రాత్రి టీ తాగేందుకు కార్ ట్రావెల్స్ కార్యాలయం నుంచి బాలాజీ హోటల్ వద్దకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి వారధి వైపునకు అతివేగంగా వెళ్తున్న 108 అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న అతనిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జి.కొండూరు: ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో గురువారం రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో బుడమేరులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం సాయంత్రానికి 3.2అడుగుల మేర నీటి నిల్వ ఉండగా 2,600క్యూసెక్కుల నీటి ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తోంది. హెచ్. ముత్యాలంపాడు వద్ద చప్టా మీదుగా బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతున్నందున పక్కనే ఉన్న శిథిల వంతెన మీదుగా ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలను ఈ వంతెన మీదుగా పోలీసులు అనుమతించడం లేదు. వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ, ప్రసాదాల తయారీ విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న బ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలని ధార్మిక పరివార్–బ్రాహ్మణ సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. శుక్రవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షుడు వి.వి. రామారావు మాట్లాడుతూ 25 ఏళ్లుగా దేవుని కై ంకర్యాలలో ఎంతో కీలకమైన పోటులో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోవడం వల్ల ప్రయోజనాలు కోల్సోవాల్సి వస్తోందన్నారు. టీటీడీలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం రెగ్యులరైజ్ చేసిందని, కానీ పోటులో పనిచేస్తున్న బ్రాహ్మణుల విషయంలో చొరవ చూపడం లేదన్నారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలన్నారు.

108 అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి

108 అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి