
ఎయిడ్స్ రహిత సమాజానికి పాటుపడదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించాలన్నారు. వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేసేలా సంస్థలు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం వైద్య ఆర్యోగ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఎయిడ్స్ వ్యాధి నివారణపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పరీక్షల కేంద్రాలతో పాటు ఐసీటీఆర్ మొబైల్ వాహనం ద్వారా ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని, 17 బ్లడ్ బ్యాంకుల ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, పాత ప్రభుత్వ ఆస్పత్రులలో ఏఆర్‌టీ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు 9 స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయన్నారు. 2024–25 సంవత్సరంలో 1,300 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించామనిని, వీరిలో 1,291 మందికి వైద్య సహాయం అందించడంతో పాటు 1,924 మందికి పెన్షన్లు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.
ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా..
‘మీకు తెలుసా’ క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ మార్గాలు, పరీక్షలు చేయించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణపై చర్చాగోష్టులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవడం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందడం, వైరల్‌లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బుక్‌లెట్లను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో డీఎం అండ్‌హెచ్‌ఓ ఎం. సుహాసిని, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ బి.బాను నాయక్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ