
వైభవంగా జైనుల శోభాయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని జైనులు నిర్వహించిన శోభాయాత్ర శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. మహావీర్ భగవానుని స్మరించుకుంటూ జైనులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. పర్యూషన్ ముగింపుతో పాటుగా అష్టసిద్ధిదాయక్ సిద్ధితప్ (36 రోజుల ఉపవాసదీక్షలు) ముగింపును పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో గుర్రపు బగ్గీని పూలతో అలంకరించి అందులో మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు. అంతేకాకుండా పర్యూషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక రోజులు ఉపవాసదీక్షలు పాటించిన కుటుంబాలను గుర్రపుబగ్గీలలో ఊరేగించారు. జైనులు సంకీర్తనలతో నత్యాలు చేస్తూ సందడి చేశారు. వన్‌టౌన్‌లోని జైనులు తమ ఇళ్ల ఎదుటకు వచ్చిన మహావీరునికి వారి సంప్రదాయ పద్ధతిలో నేలపై పీఠను ఉంచి, బియ్యంతో మహావీరుని మంత్రాన్ని రాస్తూ ఎదురు చల్లుతూ స్వాగతం పలికారు.
ఉపవాస దీక్షలు సంస్కరిస్తాయి..
ఉపవాస దీక్షలు మానవులను సంస్కరిస్తాయని ప్రముఖ జైనగురువులు పన్యాస్ ప్రవర్ సమర్పణ ప్రభ్ విజయాజి, సాధ్వి రాజనమ్రతా శ్రిజీ అన్నారు. శోభాయాత్ర మార్వాడీ గుడి వీధిలోని జైన ఆలయం నుంచి బయలుదేరి శివాలయంవీధి, మెయిన్‌బజార్, హిందూ హైస్కూల్, సుబ్బరామయ్యవీధి, వట్టూరి వారి వీధి తదితర ప్రాంతాల మీదుగా పల్లెవీధిలోని అజిత్‌నాథ్ ప్రవచన్ వాటికా ప్రాంగణానికి చేరుకుంది. పలువురు జైనగురువులు పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బోడోతరియా, ఉపాధ్యక్షుడు అశోక్ జైన్, జయంతిలాల్ జైన్, కార్యదర్శి పన్నాలాల్ జైన్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.