
ఐక్యతా మార్గంలో ‘బౌద్ధ ధర్మ యాత్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుద్ధుని బోధనలు.. శాంతి, కరుణ, సోదరభావానికి ప్రతీకలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, దక్షిణాసియా అంతటా సాంస్కృతిక, వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్ర ప్రారంభమైందన్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్ద కలెక్టర్ లక్ష్మీశ.. లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నేపాల్, భారత్, శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కవర్ చేసే లక్ష్యంతో ఈ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. దేశ త్రివిధ దళాల అధికారులు, యువ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ యాత్ర శుక్రవారం విజయవాడకు చేరుకుంది. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి స్వాగతం పలికి, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ రాహుల్ లక్ష్మణ్ పాటిల్, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, సాంస్కృతిక శాఖ అధికారి సుమన్, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.