
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాసమస్యల పరిష్కారంలో స్పష్టత తప్పనిసరి అని, ఆర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులదే బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అఽన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీ ఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపడంలో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అర్జీలపై స్పష్టత ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయని స్పష్టంచేవారు.
సొసైటీలో అక్రమాలపై విచారణ చేపట్టాలి
‘ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి మెట్రో పాలిటన్ ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్సీల జీవనం కోసం కేటాయించిన భూమి అన్యాక్రాంతమైంది. సొసైటీలోని సభ్యుల మధ్య వివాదాలు నెలకొని ఘర్షణలు జరుగుతున్నాయి. అధికారులు ఒక వర్గానికి మద్దతుగా నిలుస్తూ నిబంధనలు పాటించడం లేదు. ఎన్నికలు కూడా జరపడం లేదు. సభ్యుల సంఖ్య 53 కాగా అక్రమంగా మరికొంత మందిని చేర్చారు. వీటిపై విచారణ జరిపి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి’ అని కొటికలపూడి రైతులు అర్జీ ఇచ్చారు.
మొత్తం 187 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 53 అర్జీలు అందాయి. శాఖల వారీగా పోలీస్ 30, ఎంఏయూడీ 22, విద్య 18, పీఆర్ 10, హెల్త్ 9, డీఆర్‌డీఏ 7, ఏపీ సీపీడీసీఎల్ 5, పౌరసరఫరాలు 5, విభిన్న ప్రతిభావంతులు 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4, సర్వే 4, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ 4, ఇరిగేషన్ 2, గిరిజన సంక్షేమం 2, వ్యవసాయం 2, సాంకేతిక విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, బ్యాంకు, ఐడీసీఎస్, దేవదాయ, సోషల్ వెల్ఫేర్ విభాగాలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున అందాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.చైతన్య, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ