
అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా
పెనమలూరు: అంతర్జాతీయ స్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. యనమలకుదురుకు చెందిన కరాటే డో ఫెడరేషన్ ఏపీ చీఫ్ ఎన్.దుర్గారావు ఆదివారం వివరాలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో వివిధ దేశాల నుంచి దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారన్నారు. తమ కరాటే స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారని తెలిపారు. ఏడేళ్ల పసుపు బెల్ట్ కటా విభాగంలో జి.నినా బంగారు పతకం, వెపన్ ఈవెంట్‌లో కాంస్యం, ఎస్.అనన్య కటా పసుపు బెల్ట్‌లో బంగారు, వెపన్ కటా విభాగంలో వెండి పతకాలు సాధించారని తెలిపారు. 8ఏళ్ల ఆరెంజ్ బెల్ట్‌లో డి.చరణి బంగారు పతకం సాధించగా, గ్రీన్ బెల్ట్ కటా విభాగంలో డి.దక్ష గ్రీన్ బెల్ట్‌లో బంగారు పతకం, వెపన్ కటా విభాగంలో వెండి పతకం, 12ఏళ్ల విభాగంలో ఎ.శ్రీహర్ష ఆరెంజ్ బెల్ట్ కటా విభాగంలో బంగారు పతకం, 14ఏళ్ల విభాగంలో ఎ.వెంకట్ సురేష్ ఆరెంజ్ బెల్ట్ కటా విభాగంలో బంగారు పతకం గెలిచాడని వివరించారు.