
‘కృష్ణా’కు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ఎమ్మెల్యే, కాపునేత వంగవీటి మోహనరంగారావు పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా కార్మిక కర్షకవర్గ నాయకులుగా వంగవీటి మోహన్‌రంగాను నేటికీ ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారన్నారు. అటువంటి మహనీయుడి పేరు చిరస్థాయిగా నిలవాలంటే కృష్ణా జిల్లాకు, లేదా విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన నూతన జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలన్నారు. ఇప్పటికే ఈ విషయంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌తో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. వంగవీటి మోహనరంగా పేరు పెట్టే విషయమై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామన్నారు. ఈ డిమాండ్‌పై అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయన్నారు. రంగా పేరు పెట్టే విషయంలో ప్రభుత్వం సాను కూలంగా లేని పక్షంలో ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో కాపు నాయకులు ముత్యాల శ్రీనివాస చక్రవర్తి, జిగడం శ్రీనివాసరావు, చెన్నకేశవుల సత్యం, కె.నరేంద్ర, ద్వారపురెడ్డి వెంకటేశ్వరరావు, గేదెల గణేష్, బూరా రాజు, జ్ఞాన ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వంగవీటి మోహన్‌రంగా సోషల్ ఆర్గనైజేషన్