
ఆకట్టుకున్న శ్రమైక జీవనం చిత్రకళ ప్రదర్శన
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్, ఎం.బి.విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రమైక జీవనం చిత్రకళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 40 మంది చిత్రకారులు గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చిత్రకళ అవధాన్ మార్లపూడి ఉదయ్‌కుమార్ ప్రారంభించి మాట్లాడారు. శ్రమైక జీవన సౌందర్యంపై చిత్రకారులు గీసిన చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎన్‌ఆర్‌ఐ వల్లభనేని గిరిబాబు మాట్లాడుతూ ఈ ప్రపంచం శ్రమ మీద నడుస్తోందని, దాన్ని గౌరవించడం కర్తవ్యమన్నారు. ఏపీఎంఎస్‌ఎంఈ గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు మాట్లాడుతూ 40 మంది చిత్రకారులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం ఫోరం ఫర్ ఆర్ట్స్ బాధ్యుడు సునీల్ కుమార్ అధ్యక్షతన వర్తమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్టూనిస్ట్ శ్రీధర్ మాట్లాడుతూ చిత్రకళ కూడా మనిషి జీవనానికి అనుగుణంగానే అభివృద్ధి చెందిందన్నారు. ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, సంప్రదాయ చిత్రకళ విశ్లేషకుడు డాక్టర్ సాగర్ గిన్నె, యోగి వేమన విశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ మృత్యుంజయరావు, చిత్రకారుడు వై.శేషబ్రహ్మం ప్రసంగించారు. అమరావతి బుద్ధ విహార్ బాధ్యులు శుభాకర్ తదితరులు పాల్గొన్నారు.