
బుడమేరు వద్ద ‘ఆడశిశువు’ను వదిలేసింది కన్నతండ్రే..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు కాలువ వెంబడి శుక్రవారం రాత్రి లభ్యమైన మూడు నెలల పసికందు కుటుంబ సభ్యుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. భార్యతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కన్నతండ్రే ఆ చిన్నారిని బుడమేరు పొదల్లో వదిలివెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ పాపను తల్లికి అప్పగించి తండ్రిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోలమ్మకు వించిపేటకు చెందిన కానూరు వెంకటస్వామి (38)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. చిత్తుకాగితాలు ఏరుకునే వారికి ఎనిమిది మంది సంతానం. ఎనిమిదో సంతానంగా అంజమ్మ మూడు నెలల క్రితం జన్మించింది. ఆ తరువాత పెద్ద ఆపరేషన్ చేయించుకున్న పోలమ్మ న్యూ ఆర్‌ఆర్‌పేటలోని తన పుట్టింటి వద్దకు వచ్చి ఉంటోంది. వెంకటస్వామి వించిపేటలోని ఇంటికి వచ్చేయాలంటూ భార్యతో గొడవ పడ్డాడు. పోలమ్మ ఆరోగ్యం బాలేదని, పిల్లని ఎలా చూసుకుంటానని ఆమె పుట్టింటివారు ప్రశ్నించడంతో మూడు నెలల పాప అంజమ్మను బలవంతంగా తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. న్యూఆర్‌ఆర్‌పేట నుంచి సింగ్‌నగర్ వైపు వెళ్లే షణ్ముఖసాయి నగర్‌లో వద్ద బుడమేరు కాలువ వెంబడి ఆ పాపను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ పాప ఏడుపును విన్న స్థానికులు ఆ చిన్నారని రక్షించి పోలీసులకు అప్పగించారు. ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ రోడ్డుపై హడావు డిగా వెదకడాన్ని గుర్తించి, ఆమెను విచారించగా తన కుమార్తె కనిపించడం లేదని, తన భర్తే పాపను తీసుకొని వెళ్లిపోయాడని తెలిపింది. చిన్నారిని బుడమేరు వద్ద వదలివెళ్లిన వెంకటస్వామిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల మధ్య ఎందుకు వివాదాలు వస్తున్నాయి? చంటిబిడ్డను బుడమేరు వెంబడి వదిలేయడానికి కారణా లేంటి? ఎనిమిది మంది పిల్లలను ఎలా పెంచు తున్నారు? వంటి వివరాలు, పాప తల్లి పూర్తి ఆధారాలు తీసుకున్నాక చిన్నారిని తల్లికి అప్పగి స్తామని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు.
భార్యతో గొడవల నేపథ్యంలో అఘాయిత్యం