
అక్రమ ఆస్తుల కేసులో శైలేంద్రకుమార్ అరెస్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ చల్లరపు శైలేంద్రకుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. శైలేంద్ర కుమార్ విజయవాడ పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్‌గా పని చేస్తున్నారు. ఆయన అక్రమ ఆస్తులు కూడబెట్టా రనే సమాచారంతో ఒంగోలు ఏసీబీ అధికారులు అతని ఇళ్లలో సోదాలు జరిపారు. శైలేంద్ర కుమార్ బంధువుల ఇళ్లలో ఏడు చోట్ల రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు, బంగారపు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పెద్దమొత్తంలో నగదు, వాహనాలను గుర్తించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోదాల అనంతరం శైలేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం శైలేంద్రకుమార్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు.