
ప్రభుత్వానికి వ్యవసాయ భూములు ఇవ్వలేం
ఇబ్రహీంపట్నం: ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో మూలపాడు, త్రిలోచనాపురం, జమీమాచవరంలో భూసేకరణపై గురువారం గ్రామ సభలు నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూముల రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి రైతులు తీసుకొచ్చారు. కొంతమందికి ప్లాటు ఇచ్చినా అభివృద్ధికి నోచుకోలేద న్నారు. ఇప్పటికే రెండు వేల ఎకరాలు లంక భూ ములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, పర్యాటక అభివృద్ధి, స్పోర్ట్స్ క్లబ్ పేరుతో మరో రెండు వేల ఎకరాలు తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు వాపోయారు. రాజధానిలో వేల ఎకరాల భూమి ఇప్పటికీ ఖాళీగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మరో మూడు నాలుగేళ్లు పడుతుందని, ఈ లోపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతి రాజ ధాని ఇప్పటికీ అభివృద్ధి కాలేదని, ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి తాము తెచ్చుకోబోమని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్‌లో ఏమి ఇస్తారో ముందు ప్రకటించాలని పట్టుబట్టారు. భూమి ఉంటే జీవనోపాధి కలుగుతుందని, ప్లాటు ఉంటే కుటుంబం గడవదని పేర్కొన్నారు. రైతుల వాదనలతో సభ రసాభాసగా మారింది. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కొటికలపూడిలో గ్రామసభలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వబోమని జమీమాచవరం రైతులు చెప్పారు. మూలపాడులో 313 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లో తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తహసీల్దార్ ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైస్ ఎంపీపీ బండి నాగమణి, సర్పంచులు రెంటపల్లి నాగరాజు, చింతల భూలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు.
మూలపాడులో తెగేసి చెప్పిన రైతులు