
ప్రాణాంతకంగా బూడిద రవాణా
జి.కొండూరు: బూడిద రవాణా చేసే అక్రమార్కుల, లారీ యజమానుల అత్యాశ వాహన చోదకులకు ప్రాణాంతకంగా మారింది. బూడిదపై పట్టాలు కప్పకుండా లారీలలో పరిమితికి మించి ట్రక్కు పైన రెండు నుంచి మూడు అడుగుల మేర అదనపు లోడింగ్ చేసి రవాణా చేయడంతో దారి పొడవునా గాలికి లేచిన బూడిద వెనక వెళ్తున్న వాహన చోదకుల కళ్లల్లో పడుతోంది. తత్ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాల పాలవుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ, ఆర్టీఓ కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో బూడిద రవాణా ఇష్టారాజ్యంగా మారిపోయింది.
రహదారులపై కుప్పలు తెప్పలుగా...
ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన బూడిదను నీటితో కలిపి బూడిద చెరువులోకి తరలిస్తారు. అయితే బూడిదకి డిమాండ్ పెరగడంతో నీటితో ఉన్న బూడిదనే లారీలకు లోడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ ప్రయాణించినంత దూరం లారీలో ఉన్న డస్టు నీటితో కలిసి రహదారి పొడవునా ట్రక్కుకు ఉన్న రంధ్రాల నుంచి కిందకు పడుతోంది. ఈ డస్టు ఎండకి ఎండిన తర్వాత రహదారిపై వచ్చే వాహనాల వేగానికి వచ్చే గాలితో కలిసి రహదారి పక్కన ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి చేరుతుంది. దీనితో స్థానికులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీం పట్నం, జి.కొండూరు మండలాల్లో జాతీయ రహదారులపై ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.
లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
బూడిద లారీలను రహదారిపై నిలపడం వలన కుప్పులు కుప్పలుగా బూడిద రహదారిపై పడి నరకయాతన పడుతున్నామని ఏప్రిల్ 24వ తేదీన పశ్చిమ ఇబ్రహీంపట్నంలో స్థానికులు విజయ వాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బూడిద లారీలను అడ్డుకోవడంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో స్థానికులు తమ నిరసనను విరమించారు.
ప్రతి రోజూ 500కు పైగా లారీలు
వీటీపీఎస్ బూడిదను భవన నిర్మాణాలు, రహదారులు, ఇటుక బట్టీలకు రవాణా చేసేందుకు ప్రతి రోజూ ఐదు వందలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటితో పాటు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో ఉన్న క్వారీలు, క్రషర్లలో వచ్చే డస్టును తరలించేందుకు కొన్ని లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ లారీలలో రోజుకి 18వేల టన్నులకు పైగా బూడిద రవాణా అవుతుంటుంది. ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా లారీలలో డస్టును తరలిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. హెల్మెట్ లేదనో, లైసెన్సు లేదనో సామాన్యుల నుంచి ఫైన్ కట్టించే పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఈ విషయం ఎందుకు పట్టించుకోరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పైన పట్టాలు కప్పకుండా
యథేచ్ఛగా తరలింపు
గాలికి లేచి వాహన చోదకుల
కళ్లల్లో పడుతున్న వైనం
ఈ కారణంగా ఎదురొచ్చే
వాహనాలు కనిపించక ప్రమాదాలు
ఇబ్రహీంపట్నం, జి.కొండూరు
మండలాల్లో ప్రధానంగా సమస్య
పట్టించుకోని పొల్యూషన్
కంట్రోల్ బోర్డు అధికారులు

ప్రాణాంతకంగా బూడిద రవాణా