
యోగాతో ఆరోగ్య మహాభాగ్యం
కలెక్టర్ లక్ష్మీశ,
ప్రభుత్వ విప్ బొండా ఉమా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అందుకే ప్రతి ఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ బీఆర్ టీఎస్ రోడ్డు శారదా కళాశాల జంక్షన్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే ఉమా తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు యోగా విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యంపై శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని యోగాను తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎన్ ఎస్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.