
పంట సంరక్షణలో అన్నదాతలు
● తడిసిన మొక్కజొన్న, ధాన్యం ఆరబెట్టే పనిలో నిమగ్నం ● పల్లపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● దెబ్బతిన్న పంట.. మద్దతు ధరపై ఆందోళన
కంకిపాడు: రైతులు పంట సంరక్షణ పనులపై దృష్టి పెట్టారు. భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని ఎండబెట్టి నాణ్యతను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షంతో తడిసిన ధాన్యం, మొక్కజొన్న నాణ్యత దెబ్బతిని మద్దతు ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వాన బీభత్సం కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్లాలు, ఖాళీ స్థలాల్లో ఆరబోసి రాశులు మీద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు సైతం వర్షానికి తడిశాయి. పంట చేతికొచ్చిన తరుణంలో భారీ వర్షం ఊహించని ఉపద్రవంలా రైతులపై విరుచుకుపడింది.
మద్దతుపై ఆందోళన..
భారీ వర్షం రైతులకు అకాల నష్టాన్ని తెచ్చిపెట్టినట్లయ్యింది. వర్షానికి ధాన్యం తడవటంతో మళ్లీ తేమశాతం పెరగటంతో మద్దతు ధర దక్కే విషయంలో నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 75 కిలోల బస్తాకు బయటి దళారులు రూ. 1,350 ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌కేల ద్వారా సంచులు, రవాణా వాహనాలను సమకూర్చి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్న వాదన దాళ్వా రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో పాటు సుమారు 4 వేల ఎకరాల్లో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట తడవటంతో గింజలు నలుపెక్కుతాయని వాపోతున్నారు. క్వింటా రూ. 2 వేలు పలుకుతుందని, నాణ్యత దెబ్బతింటే ధర ఎంత పలుకుతుందో తెలీటం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో మొక్కజొన్న రైతులు మునిగిపోయారు. ఇప్పటికై నా వర్ష ప్రభావ ప్రాంతాలను గుర్తించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను స్థానికంగా తెరిచి మద్దతు ధర అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చలిగాలుల నుంచి..
సోమవారం, మంగళవారం ఉదయం వేళల్లో తీవ్రమైన ఎండ, వడగాల్పులు కారణంగా పంటను ఆరబెట్టేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో తడిసిన ధాన్యం రాశులు, మొక్కజొన్న రాశులను పూర్తి స్థాయిలో తిరగబెట్టి ఎండగట్టారు. కూలీలు, దంతిల సాయంతో రాశులను ఎండబెట్టి కాటాలు వేయించారు. పల్లపు ప్రాంతాలైన డొంకరోడ్లలో ఉన్న మొక్కొజొన్న, ధాన్యం రాశులను మెరక ప్రాంతాల్లో ఉన్న ఖాళీ వెంచర్లలోకి తరలించి సంరక్షించుకున్నారు. సాయంత్రం వేళల్లో చలిగాలులకు తేమ పెరగకుండా చుట్టూ పరదాలు, టార్పాలిన్‌లు కట్టి పంటను జాగ్రత్త చేసుకుంటున్నారు.

పంట సంరక్షణలో అన్నదాతలు