
చివరికి కడగండ్లే!
కంకిపాడు సెక్షన్ పరిధిలో బందరు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టుకు సాగు నీరు చేరడం గగనంగా మారుతోంది. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో రైతులకు కష్టాలు, కడగండ్లు తప్పడం లేదు. ఇప్పటికే కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. ఈపాటికే పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు, అక్కడక్కడ కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. అయితే ప్రభుత్వం ఈ పనులు చేసే దిశగా అడుగులు వేయటం లేదు. జూన్ మొదటివారంలోపు పనులు పూర్తి చేయకుంటే, తర్వాత కాలువలకు సాగు నీరు విడుదల చేస్తారు. పనులు చేసే అవకాశం ఉండదు. ఇదే అదునుగా పనులు మంజూరు అయినప్పటికీ, పనులు చేయకుండానే మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం కూడా ఉంది. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకిపోక అల్లాడిపోతున్నారు. డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది.
పనుల మంజూరులో జాప్యం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి నెలలోనే ప్రభుత్వానికి పంపా రు. ప్రభుత్వం ఇప్పటికీ పనులు చేసేందుకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో ఈ నెలలో పనులు పూర్తి కావటం గగనమే. గత ఏడాది పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలో జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం లెస్ వేసి పనులు దక్కించుకున్నారు. వీరంతా పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై ్క బిల్లులు దండుకొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బుడమేరులో మేటవేసిన గుర్రపుడెక్క
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో ఆయకట్టు కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన తూటికాడ కొద్దిపాటి వర్షానికే పొలాల మునక ఇంకా ప్రతిపాదన దశలోనే పనులు జూన్ మొదటి వారంలోపు పనులు చేయకపోతే కష్టాల సాగే
ఈ ఏడాది ప్రతిపాదిత పనులు..
డివిజన్ పనుల విలువ
సంఖ్య (రూ.కోట్లలో)
కృష్ణా తూర్పు 121 8.45
కృష్ణా సెంట్రల్ 144 7.28
డ్రెయినేజి విభాగం 288 9.00
స్పెషల్ 15 1.30
మొత్తం 568 26.03
కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాల్లో)
కాలువ కృష్ణా ఎన్టీఆర్
బందరు 1.51లక్షలు –
కేఈబీ 1.38 లక్షలు –
ఏలూరు 0.56 లక్షలు 1,332
రైవస్ 2.17 లక్షలు 425
మొత్తం 5.62లక్షలు 1,757