గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించా లని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో టీబీ ముక్తి పథకం ద్వారా గుర్తించిన పంచాయతీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే ఆ సమాచారాన్ని జిల్లా క్షయ నివారణ అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నందిగామ మండలం తొర్రగుడిపాడు, వత్సవాయి మండలం ఇందుగపల్లి, జి.కొండూరు మండలం చిన నందిగామ, చందర్లపాడు మండలం ఏటూరు గ్రామా లను జిల్లాలో క్షయ లేని గ్రామాలుగా గుర్తించామన్నారు. ఈ ఏడాది ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి పంచాయతీలు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ అధికారులు, వైద్యాధికారులు సమష్టి కృషితో నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డీఎంహెచ్‌ఓ సుహాసిని, డీఎంఓ డాక్టర్ మోతిబాబు, డెప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ