ఇక ఆంధ్రా రైతు బ్రాండ్‌! | - | Sakshi
Sakshi News home page

ఇక ఆంధ్రా రైతు బ్రాండ్‌!

Apr 18 2024 11:50 AM | Updated on Apr 18 2024 11:50 AM

 మేలైన సేద్య పద్ధతులను చిత్రాల ద్వారా రైతులకు వివరిస్తున్న అధికారులు (ఫైల్‌) - Sakshi

మేలైన సేద్య పద్ధతులను చిత్రాల ద్వారా రైతులకు వివరిస్తున్న అధికారులు (ఫైల్‌)

అన్నదాతకు తీరని కల ఒకటి ఉంది. తన పంటను నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు విక్రయించుకోవడం! దీనిని సుసాధ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. పండించిన పంటను ప్రీమియం ధరకు అమ్ముకునేందుకు వీలుగా గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌(జీఏపీ) సర్టిఫికేషన్‌ను తీసుకొచ్చింది. మన దేశంలో ఇది అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం.

సర్టిఫికెట్ల జారీ..

నాణ్యతా పరీక్షల అనంతరం ఈ పదహారు మంది రైతులు పండించిన ధాన్యం నమూనాలు ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ రెగ్యులేషన్‌–2011కి అనుగుణంగా ఉన్నట్లు తేల్చి రైతుల ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారిస్తూ.. ఏపీఎస్‌ఓపీసీఏ పదహారు మంది రైతులకు సర్టిఫికెట్‌లను జారీ చేసింది. సర్టిఫికెట్‌లను పొందిన రైతులకు ప్రస్తుతం రబీ సీజన్‌లో కూడా శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణలో రైతుల ధాన్యం ఉత్పత్తులను క్వాలిటీ పరీక్షలు జరిపి సర్టిఫికెట్‌లను ఇచ్చేందుకు ఈ పదహారు మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసింది.

జి.కొండూరు: ఆంధ్రప్రదేశ్‌ రైతులను గ్లోబల్‌ మార్కెట్‌లో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేశారు. వైఎస్సార్‌ పొలంబడి పేరుతో సాధారణంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలతో పాటు మేలైన సేద్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే.. ఆర్గానిక్‌ వ్యవసాయంపై సంపూర్ణ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా రైతులే తమ ఆహార ధాన్యాలను విక్రయించే విధంగా ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లాలోని జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వైఎస్సార్‌ ఇండ్‌గ్యాప్‌(జీఏపీ) పొలంబడి పేరుతో 16మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆర్గానిక్‌ ప్రోడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ(ఏపీఎస్‌ఓపీసీఏ) ద్వారా స్కోప్‌ సర్టిఫికెట్‌లను సైతం అందజేశారు.

శిక్షణ ఇలా..

వైఎస్సార్‌ ఇండ్‌ గ్యాప్‌ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 2023–24 సంవత్సరానికి గానూ ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లలో వరి పండించే కుంటముక్కల గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అనంతరం ప్రేమధార ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ మ్యూచువల్లి ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌లో సభ్యులుగా ఉన్న పదహారు మంది రైతులను ఎంపిక చేశారు. ఈ పదహారు మంది రైతులు సాగు చేస్తున్న 61.65ఎకరాల భూమిలో శిక్షణ ప్రారంభించారు.

వీటిపైనే శిక్షణ..

జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ, నీటి యాజమాన్యం, సమగ్ర కలుపు నివారణ యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టడం, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు తయారు చేయడం, రైతులే తమ పొలాల్లో పర్యావరణ కారకాలపై అధ్యయనం చేసి సాధికారతను సాధించడం, వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

కేంద్ర బృందాల పర్యవేక్షణ..

ఈ శిక్షణకు ఎంపిక చేసిన రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో 14వారాల చొప్పున ప్రతి శుక్రవారం ఇండ్‌ గ్యాప్‌ పొలంబడి శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో రైతులు పండిస్తున్న వరి పైరుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అధారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)కి చెందిన క్యాలిటీ మేనేజ్‌మెంట్‌ బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. పంట కాలం పూర్తయిన తర్వాత ధాన్యాన్ని పరీక్షలకు పంపింది. ఈ పరీక్షలలో పంట ఉత్పత్తులలో ఆర్సనిక్‌, కాడ్మియం, కాపర్‌, మెర్కురీ, టిన్‌ వంటి ఇన్‌ ఆర్గానిక్‌ అవశేషాలతో పాటు సూక్ష్మ విష పదార్థాలైన ఎప్లోటాక్సిన్స్‌, రసాయనిక అవశేషాలు కూడా లేనట్లు గుర్తించారు.

ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వైఎస్సార్‌ ‘గ్యాప్‌’ పొలంబడి గ్లోబల్‌ మార్కెటింగే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా కుంటముక్కలలో నిర్వహణ ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆరోగ్యం, అధికాదాయమే లక్ష్యం

రైతులకు సువర్ణావకాశం

వైఎస్సార్‌ ఇండ్‌ గ్యాప్‌ పొలంబడి రైతులకు సువర్ణావకాశం. ఈ శిక్షణ కార్యక్రమం వల్ల రైతులు తమ ధాన్యాన్ని గ్లోబల్‌ మార్కెట్‌లో నేరుగా అమ్ముకునేలా వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో గ్లోబల్‌ మార్కెటింగ్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వడం గొప్ప నిర్ణయం.

– ఎం. రాంకుమార్‌, వ్యవసాయాధికారి, జి.కొండూరు

సేంద్రియమే మేలు

సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే విధానంపై 14వారాలు శిక్షణ ఇచ్చారు. నేను 7.70ఎకరాలలో ఎంటీయూ–1061 రకం వరిని సాగు చేశా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చాయి. మా పంటను ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునేలా సర్టిఫికెట్‌లు కూడా ఇచ్చారు.

– పామర్తి సాంబయ్య, రైతు, కుంటముక్కల గ్రామం

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement