
జీఎస్టీ సంస్కరణలతో సుస్థిర ఆర్థిక ప్రగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీఎస్టీ 2.0 సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సంస్కరణల ఫలితంగా దేశ వ్యాప్తంగా 99శాతం వస్తువులు, సేవలు పన్ను రహితం కావడం లేదా 5 శాతం, 18 శాతం జీఎస్‌టీ పరిధిలోకి వచ్చాయన్నారు. సూపర్ జీఎస్‌టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పా టు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఆతిథ్య రంగానికి ఊతం..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ. 8 వేల కోట్లు, జిల్లా ప్రజలకు రూ. 300 కోట్లు, ప్రతికుటుంబానికి నెలకు రూ. 6 వేలు నుంచి రూ.12 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆర్టీవోలు ఆర్. ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్‌లు వై. నాగేశ్వరరావు, వి.పద్మాకర్, అలీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రియదర్శిని, కృష్ణాజిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్, విజయవాడ టాక్సీ ఓనర్ల అసోసియేషన్, ఎన్‌ఏఎంటీఏ అసోసియేషన్, టీఎన్ టీయూసీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బాబూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ