
కమనీయ కార్తికానికి సంసిద్ధం
సతికి బదులు పతి హాజరు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రానున్న రెండు నెలల్లో జరిగే విశేష పూజలు, పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆవరణలోని మహా మండపం ఆరో అంతస్తులో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో దేవస్థానంలో నిర్వహించనున్న ఉత్సవాలు, విశేష పర్వదినాలు, భవానీ దీక్ష స్వీకరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత దేవస్థానం అమ్మవారి అలంకరణలు, ఆలయ బంగారు శిఖరం, రాజగోపురం ఫొటోలతో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
20న దీపావళి వేడుకలు..
19వ తేదీ ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8గంటలకు దేవస్థాన యాగశాలలో శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. ఈ యాగం దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, భక్తుల పరోక్ష సేవగా జరుగుతుందన్నారు. ఇక 20వ తేదీ దీపావళి పర్వదినాన ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మీపూజ, దీపాలంకరణ, దీపావళి వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు.
కార్తికం.. ఆధ్యాత్మిక సంరంభం..
21వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తామని, 22వ తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమవుతాయని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవాలలో ప్రతి నిత్యం స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు కార్తిక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో స్వామి వారికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపో త్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేష పూజలు నిర్వహిస్తామన్నారు.
దుర్గమ్మ గాజుల సంబరం..
దుర్గమ్మకు 23వ తేదీన గాజులతో విశేష అలంకరణ చేస్తారని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మూలవిరాట్‌కు గాజులతో విశేషంగా అలంకరిస్తామన్నారు. అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని వివరించారు.
ప్రత్యేక బిల్వార్చన జరిగే తేదీలు..
కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిథులలో బిల్వార్చన నిర్వహిస్తారు. 27వ తేదీ సోమవారం శుద్ధ చవితి, నవంబర్ 1వ తేదీ శనివారం శుద్ధ ఏకాదశి, 3వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి, 05వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి, 10వ తేదీ సోమవారం బహుళ పంచమి, 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి, 17వ తేదీ సోమవారం బహుళ త్రయోదశి 18వ తేదీ మంగళవారం మాస శివరాత్రిన ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది.
నవంబర్ 1 నుంచి భవానీ దీక్షలు
నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్ధమండల దీక్షలు నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీదీక్ష విరమణలు జరుగుతాయని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై 22 నుంచి
కార్తిక మాసోత్సవాలు
23న దుర్గమ్మకు గాజుల అలంకరణ
భక్తులకు ఇబ్బందుల్లేకుండా
పక్కా ఏర్పాట్లు
మీడియాతో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్