
రూ 2.96కోట్ల మెరిట్ స్కాలర్‌షిప్‌లు పంపిణీ
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు గురువారంరూ.2,96,37,000 మెరిట్ స్కాలర్ షిప్పులు యాజ మాన్యం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీగా మార్చిన తర్వాత విద్యార్థులకు తాము పూర్తి అండగా ఉన్నామన్నారు. గతంలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ఉండేదని, యూనివర్సిటీ చేసిన తరువాత తామే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామన్నారు. చదువులో ప్రతిభ, హాజరు శాతం పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025–2026లో 624 మంది విద్యార్థులకు రూ.2.96కోట్లను స్కాలర్‌షిప్‌లుగా ఇచ్చామన్నారు. ఆన్‌లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డాక్టర్ జీఎన్.స్వామి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.