
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ అటెండర్ ఒక దుకాణ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి విజయవాడ పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్‌లో కొండపల్లి శ్రీనివాసరావు అటెండర్‌గా పని చేస్తున్నాడు. అతను గురువారం రాత్రి పాతబస్తీ సుబ్బరామయ్యవీధిలోని జెండాచెట్టు వద్ద ఒక వాహనాన్ని ఆపి అందులో ఉన్న సరుకుకు బిల్లు చూపించాలని అడిగాడు. బిల్లు చూపించగా దానిని చింపేసి తనకు రూ.40 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దానికి వాహనదారుడు తన దుకాణ యజమాని జోగారావు చౌదరిని అక్కడకు పిలిపించాడు. జోగారావు చౌదరి అతనికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో రూ.16 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ రంగారావు అక్కడ దాడి చేశాడు. లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెనుగంచిప్రోలు: గ్రామానికి చెందిన చిట్స్, గోల్డ్ స్కీం వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ అర్జున్ గురువారం తెలిపారు. గోల్డ్ స్కీం, చిట్స్, వడ్డీకి డబ్బులు తీసుకుని అతను పారిపోయాడన్నారు. అతనిపై చీటింగ్ కేసుతో పాటు చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రజలు లైసెన్స్ లేని చిట్స్, గోల్డ్ స్కీంలలో చేరవద్దని ఎస్‌ఐ సూచించారు. దుర్గారావు బాధితులు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. గురువారం సాయంత్రానికి 68 మంది ప్రామిసరీ నోట్లు, గోల్డ్ స్కీం రశీదులతో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముసిముక్కు కనకచింతయ్య, అతని భార్య సీతామహాలక్ష్మి(42) వ్యవసాయ సనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కపక్కనే నివాసిస్తున్న కనకచింతయ్యకు, అతని సోదరుడైన వడ్డీకాసులకు గత కొంత కాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై రెండు నెలలు క్రితం వీరి మధ్య జరిగిన గొడవలో సీతామహాలక్ష్మిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనపై అప్పట్లో ఉంగుటూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో సీతామహాలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకాసులు కుటుంబ సభ్యులే సీతామహాలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త కనకచింతయ్య, కుమారుడు రాజేష్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆమైపె దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.