
తాను తవ్విన గోతిలోనే పడిన కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ తీసుకున్న సారా గోతిలోనే కూటమి ప్రభుత్వం పడిందని.. దాని నుంచి బయటపడేందుకు వైఎస్సార్ సీపీ నాయకులపై బురద చల్లుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విమర్శించారు. సత్యనారాయణపురం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సూపర్ లేబుల్స్‌కు పరిమితం అయ్యారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జోగి రమేష్‌ను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసులు సమగ్రంగా విచారణ చేయటం లేదన్నారు. జోగి రమేష్‌కు ఎలాంటి నిక్ నేమ్స్ లేవని.. కంప్లైంట్‌లో 1 రమేష్ అని పెట్టించారని ఫోన్లో చూపించారు. తద్వారా ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే అని తేలిపోయిందన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. 16 నెలలు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ పెట్టాం అని చెబుతున్నారని.. గతంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ క్యూ ఆర్ కోడ్ పద్ధతిని తెచ్చిందని గుర్తు చేశారు. జైలులో ఉన్న జనార్దన్ వీడియో బయటకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి