కూచిపూడి(మొవ్వ): కూచిపూడి సంప్రదాయ నాట్యంలో నిష్ణాతులైన ముగ్గురికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు వరించాయి. ఈ విషయాన్ని అకాడమీ కార్యదర్శి రాజుదాస్ ప్రకటించారు. దీని పై కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగ శాస్త్రి బుధవారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. కూచిపూడి నాట్యానికి విశేష సేవలు అందించి దేశ విదేశాల్లో ప్రాచుర్యం
పొందిన డాక్టర్ భాగవతుల సేతురామ్, మద్దాలి ఉషా గాయత్రిలకు సంగీత నాటక అకాడమీ అవార్డులు, ఎం.సురేంద్రనాథ్‌కు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2023 సంవత్సరానికి ఎంపిక కావటంతో కూచిపూడి కళా కుటుంబంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది.
● డాక్టర్ భాగవతుల సేతురామ్ హైదరాబాదులోని పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య విభాగానికి కులపతిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ
పొందారు. అలనాటి నాట్యాచార్యులు భాగవతుల రామకోటయ్య (కూచిపూడి) కుమారుడైన సేతురామ్ ఆయన వద్ద శిష్యరికం చేశారు.
● మద్దాలి ఉషా గాయత్రి కూచిపూడి నాట్యాచార్యులైన వేదాంతం జగన్నాథ శర్మ, పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు.
సురేంద్రనాథ్‌కు బిస్మిల్లా ఖాన్ పురస్కారం
యువ నాట్యాచార్యులు ఎం.సురేంద్రనాథ్ కూచిపూడి నాట్య కళాపీఠంలో డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి వద్ద నాట్యాన్ని అభ్యసించారు. కూచిపూడి గ్రామానికి అనుబంధం ఉన్న ఈ కళాకారులకు అవార్డులు వరించటం పై నాట్యాచార్యులు కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, పసుమర్తి రత్తయ్య శర్మ, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసరావుతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.


