
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రక్షణ వలయంగా ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దళారుల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు విముక్తి కల్పించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జింఖానా మైదానంలో ఏపీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీ జేఏసీ అమరావతి అనుబంధం) ప్రథమ మహాసభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అందరి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని కోరారు. ప్రైవేటు ఏజెన్సీల బారి నుంచి ప్రభుత్వం చిరు ఉద్యోగులను రక్షించి వారికి రక్షణ వలయంగా ఆప్కాస్ ఏర్పాటు చేసినందుకు మహాసభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన కృజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు మాట్లాడుతూ ఆప్కాస్ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఇతర శాఖల్లో పనిచేస్తూ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్న వారిని ఆప్కాస్ పరిఽధిలోకి తేవాలన్నారు..
15 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక..
మహాసభలో తొలుత కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.సుమన్, ప్రధాన కార్యదర్శిగా అల్లం సురేష్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.గురునాథ్, వైస్ ప్రెసిడెంట్లుగా జి.సంపత్, ఎస్.వి.కృష్ణ, జె.మెర్సీ కుమారి, కె.జైరామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.వేణు, సెక్రటరీలుగా ఎం.మధు బాబు, పి.కిషోర్ కుమార్, పి.సుధీర్ కుమార్ సిహెచ్.రమణమూర్తి, పి.విజయభారతి, ఎం.రామకృష్ణ, కోశాధికారిగా యు.అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ ప్రథమ మహాసభలో ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ టి.వి.ఫణి పేర్రాజు, మహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ పారే లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, అసోసియేట్ ప్రెసిడెంట్ శివ కుమారి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సభలో మాట్లాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు