
మాట్లాడుతున్న త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):దివ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి చెప్పారు. సక్షమ్ (దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న అఖిల భారత సంస్థ) ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో దివ్యాంగుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో అన్ని కోల్పోయినా ఆత్మ విశ్వాసం ఉంటే ధైర్యంగా, ఆనందంగా గడపవచ్చని చెప్పారు. మనిషి శరీరంలో ఏదైనా లోపం ఉందని అంటే అతనిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని తెలిపారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో అంధులైన పిల్లలకు క్రికెట్‌లో శిక్షణ ఇచ్చామని, వారు లండన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోకి అంధుల క్రికెట్ జట్టుతో ఆడి బంగారు పతకాలు పొందారని చెప్పారు. అంధుల కోసం వికాస తరంగిణి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక స్కూల్, కళాశాలను స్థాపించి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సక్షమ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు గోవింద రాజన్ మాట్లాడుతూ దివ్యాంగుల వికాసం, సంక్షేమం, సాధికారత కోసం 2008లో ఈ సంస్థను స్ధాపించామని చెప్పారు. దేశాభివృద్ధిలో దివ్యాంగులను భాగస్వామ్యం చేయడంతో పాటుగా వారిని ఆత్మ గౌరవంతో జీవించే విధంగా తమ సంస్థ వారికి అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు ఆరోగ్య పరమైన సేవలు, వారికి అవసరమైన పరికరాలు, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తుంటాని వివరించారు. సక్షమ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర పర్యవేక్షణ మండలి మాజీ సభ్యుడు గూట్లపల్లి సాయి జనార్థన్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం చర్చించేందుకు చట్టసభల్లో నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కోరారు. ఆంధ్రా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పీవీ రామారావు మాట్లాడుతూ 15 సంవత్సరాల లోపు చిన్నారులకు గుండె సంబంధిత జబ్బులకు తమ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ (గుంటూరు) డాక్టర్ బి.కృష్ణవేణి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, పారిశ్రామికవేత్తలు బి.మల్లికార్జునరావు, కె.మోహన్‌రెడ్డి, కె.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సక్షమ్ క్యాలెండర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సభకు ముందుగా దివ్యాంగులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మౌనంగానే ఎదగమని అంటూ పాటను ఆలపించి అందరిని ఉత్తేజపరిచారు. సెల్‌ఫోన్ వల్ల జరిగే దష్ఫలితాలను మైమ్ ద్వారా దివ్యాంగులు ప్రదర్శించారు. హిందీ, తెలుగు సినీ పాటలకు డ్యాన్స్‌లు చేసి ఉత్సాహపర్చారు.
దివ్యాంగుల సమ్మేళనంలో వక్తలు

నృత్యాలు ప్రదర్శిస్తున్న దివ్యాంగులు