కృష్ణా తీరాన కార్తిక జ్వాల | - | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరాన కార్తిక జ్వాల

Dec 11 2023 2:00 AM | Updated on Dec 11 2023 2:00 AM

రామలింగేశ్వరునికి అభిముఖంగా సామూహిక హారతులు ఇస్తున్న మహిళలు  - Sakshi

రామలింగేశ్వరునికి అభిముఖంగా సామూహిక హారతులు ఇస్తున్న మహిళలు

రామలింగేశ్వరునికి భారీ ఒత్తితో నీరాజనం

మూడున్నర అడుగుల ఎత్తు, 18 కిలోల ఒత్తితో స్వామికి దీప నివేదన

బాపట్ల షిరిడీ సాయిబాబా మందిరం పూజారి సాయిస్వామి సమర్పణ

నాగాయలంక: ద్వితీయ వార్షిక కార్తిక మాసోత్సవాల చివరి రోజులు, త్రయోదశి, మాసశివరాత్రి పర్వదినాలు పురస్కరించుకుని కృష్ణానది తీరం శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ వద్ద గంగ పార్వతీ సమేత రామలింగేశ్వరునికి ఆదివారం రాత్రి 18 కిలోల అఖండ ఒత్తితో జ్యోతి దీప ప్రజ్వలన వైభవంగా జరిగింది. ఇందుకోసం 60 కిలోల నూనెను వినియోగించినట్లు నిర్వాహకులు చెప్పారు. బాపట్లలోని షిర్డి సాయిబాబా మందిరం పూజారి సాయిస్వామి ఇక్కడి శ్రీరామపాదక్షేత్రం సాగరసంగమ ప్రాంత విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆకర్షితుడై రామలింగేశ్వరునికి ప్రత్యేకమైన భారీ ఒత్తి, నూనె మొత్తం తీసుకొచ్చి సమర్పించారు. సాయిస్వామి తన 30 మంది బృందంతో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని స్వయంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణవేణి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. కృష్ణానదికి జ్యోతిర్లాంగాల ముగ్గుల వద్ద కోటి వత్తుల దిమ్మెలతో ప్రత్యేకంగా హారతి

సమర్పించారు.

సామూహిక హారతి సమర్పణ...

నిత్య నవహారతులును వేద పండితులు బ్రహ్మశ్రీ సాయికిరణ్‌శర్మ, సుబ్రహ్మణ్యం, షణ్ముఖ చంద్రశేఖరన్‌ భక్తిశ్రద్ధలతో ప్రదర్శించారు. అభిముఖంగా మహిళలు కార్తిక ప్రమిదల ప్లేట్‌లతో సామూహిక హారతి ఇచ్చారు. కృష్ణాతీరంలో ఈ విధమైన భారీ వత్తులతో కార్తిక జ్యోతుల కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి కావడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఉవ్వెత్తున లేచిన కార్తిక జ్వాలలతో స్వామికి అద్భత నివేదన చేశారు. వందలాది మంది మహిళలు, భక్తులు ఈ వేడుకను తిలకించారు. నదీతీరం భక్తుల శివ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామపాద క్షేత్రం కమిటీ చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సాయిస్వామిని కమిటీ తరపున సన్మానించారు. రామలింగేశ్వరునికి మరో 18 కిలోల వత్తిని శివస్వామి బృందం సమర్పించారు. ఉప్పల లీలాకృష్ణప్రసాద్‌, తలశిల రఘుశేఖర్‌, బోయపాటి రాము తదితరులు పాల్గొన్నారు.

నాగాభరణం, భారీ పూల మాలలతో స్వామికి విశేష అలంకారం చేసిన దృశ్యం 1
1/3

నాగాభరణం, భారీ పూల మాలలతో స్వామికి విశేష అలంకారం చేసిన దృశ్యం

త్రయోదశి సందర్భంగా నందికి నవహారతులు ఇస్తున్న వేదపండితులు 2
2/3

త్రయోదశి సందర్భంగా నందికి నవహారతులు ఇస్తున్న వేదపండితులు

18 కిలోల కార్తిక ఒత్తికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న 
బాపట్ల సాయి మందిరం పూజారి సాయిస్వామి   3
3/3

18 కిలోల కార్తిక ఒత్తికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న బాపట్ల సాయి మందిరం పూజారి సాయిస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement