
గుణదల (విజయవాడ తూర్పు): విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు సాక్షి మీడియా నిర్వహిస్తున్న స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పలువురు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఆంధ్ర లయోల ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఆదివారం స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలు రాశారు. డ్యూక్స్ వ్యాపి సంస్థ ప్రజెంటింగ్ స్పాన్సర్స్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించాయి. 1–10 తరగతి విద్యార్థులను 4 కేటగిరీలుగా విభజించి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ నిర్వహించారు. స్పెల్ బీకి 598 మంది విద్యార్థులు హాజరు కాగా, 498 మంది విద్యార్థులు మ్యాథ్స్ బీ పరీక్ష రాశారు. నిర్ణీత సమయంలో పరీక్షలు రాసి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇంగ్లిష్, గణితంపై పట్టునకు స్పెల్ బీ, మ్యాథ్స్ బీ దోహదం పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన
విద్యార్థులకు ఎంతో మేలు..
సాక్షి మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెల్ బీ, మాథ్స్ బీ పరీక్షల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంగ్లిష్, లెక్కలు అంటే కొంత మంది విద్యార్థులలో తెలియని భయం ఉంటుంది. ఆ భయాన్ని వీడి ఆయా సబ్జెక్టులలో అవగాహన పెంపొందించుకునేందుకు ఈ పరీక్షలు దోహద పడతాయి.
– పి. ప్రిస్కిల్లా, అసోసియేట్ ప్రొఫెసర్, లయోల కళాశాల
చాలా ప్రయోజనకరం..
విద్యార్థుల పాఠ్యాంశాలలో ఇంగ్లిష్, లెక్కలు ముఖ్యమైన సబ్జెక్టులు. వీటిపై అవగాహన కల్పించేందుకు, విద్యార్థులలో ఉన్న భయం పోగొట్టేందుకు ఇటువంటి పరీక్షలు ఉపయోగకరంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.
– మాన్సీ, గృహిణి, విజయవాడ
మరింత అవగాహన..
ఇంగ్లిష్ సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన కోసం ఈ స్పెల్ బీ ఎగ్జామ్ దోహదపడింది. నేను ఇంగ్లిష్ ఎలా ఎలా చదవాలో, స్పెల్లింగ్స్ ఏ విధంగా రాయాలో తెలిసింది. గత ఏడాది సైతం నేను ఈ పరీక్షకు హాజరయ్యాను. ఇంగ్లిష్ భాషపై నాకు ఉన్న భయం పూర్తిగా పోయింది.
– ఎం. తేజశ్విని, 10వ తరగతి, కేకేఆర్ గౌతమ్ స్కూల్, గూడవల్లి
లెక్కలంటే భయం లేదు..
అన్ని సబ్జెక్టులు బాగానే చదవగలను కానీ మ్యాథ్స్ మాత్రం చాలా భయంగా ఉంటోంది. కానీ ఈ మ్యాథ్స్ బీ పరీక్ష రాయటం ద్వారా లెక్కలు ఏ విధంగా చేయాలి, ఫార్ములాలను ఎలా ఉపయోగించాలో తెలిసింది. ఇకపై లెక్కలంటే భయం లేకుండా ఉండగలను.
– టి. ఆకాష్, 5వ తరగతి,
విజ్ఞాన విహార్ స్కూల్, విజయవాడ

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలం






