
పెనమలూరు మండలంలో పంట బోదెలో గడ్డి, తూడు తొలగిస్తున్న కూలీలు
ఉపాధి తోడుగా..
తుపాను నష్టం నివారణకు..
తుపాను వల్ల రైతులకు ఏర్పడిన నష్టాన్ని నివారించేందుకు శాఖాపరమైన చర్యలు చేపడుతున్నాం. పంట బోదెలు, కాలువల తూడు, గడ్డి తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు. ధాన్యం ఆరబోత పనుల్లో రైతులకు సాయంగా ఉపాధి కూలీలను వినియోగిస్తున్నాం. ఈ చర్యలతో పంట పొలాల్లో మురుగు కాలువలు, బోదెల్లోకి మళ్లి పంట పొలాలు తేరుకుంటాయి. నష్టం తగ్గుతుంది. పనులు సమర్థంగా సాగేలా పర్యవేక్షిస్తున్నాం.
– జీవీ సూర్యనారాయణ, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా
●
కంకిపాడు(పెనమలూరు): మిచాంగ్ తుపానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. పంట సంరక్షణ చర్యల్లో రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతాంగానికి ఆలంబనగా నిలుస్తోంది. పొలాల్లో నిలిచిన మురుగు పారుదలకు వీలుగా పంట బోదెల్లో తూడు, గడ్డి, పూడికతీత పనులను చేపడుతోంది. కల్లాలు, బహిరంగ ప్రదేశాల్లో ధాన్యం రాశులను ఆరబోసేందుకు ఉపాధి కూలీలను సహాయంగా అందిస్తోంది. ప్రభుత్వ చేయూతతో తుపాను నష్టం నుంచి రైతులు కోలుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా 433 గ్రామాల పరిధిలోని 2.71 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. వరి పనలు నీట మునిగాయి. ఉద్యానశాఖకు సంబంధించి అరటి, కంద, తమలపాకు, కూరగాయలు, పూలతోటలు సుమారుగా 600 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
పంట సంరక్షణ చర్యల్లో అన్నదాతలు..
ఈనెల 6వ తేదీ నుంచి వాతావరణం తెరపిచ్చింది. అప్పటి నుంచి రైతులు కల్లాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ధాన్యం ఆరబోయటం, మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను కాటా వేసి మిల్లులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో పాటు పొలాల్లో ఉన్న వర్షపునీటిని పంట బోదెలు, కాలువల్లోకి మళ్లించటం, నీరు పోని పరిస్థితుల్లో ఆయిల్ ఇంజిన్లను వినియోగించి పంట సంరక్షణ చర్యలను ముమ్మరం చేశారు.
‘ఉపాధి’ ఊతం..
మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైతులకు సాయంగా ఉండేందుకు తుపాను సహాయక చర్యల్లో ఉపాధి కూలీలను భాగస్వామ్యం చేశారు. అత్యవసరమైన పనులను ఉపాధి కూలీలతో చేయిస్తూ తుపాను నష్టం నుంచి రైతులకు ఊరట కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో గడిచిన మూడు రోజులుగా ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. 25 మండలాల్లో 256 పనులను గుర్తించారు. ఆయా గ్రామాల్లో పంట బోదెల పూడికతీత, బోదెల్లో గడ్డి, తూడు, గుర్రపుడెక్క తొలగించి మురుగుపారుదల సజావుగా సాగేలా చేయటం వంటి పనులను ఉపాధి కూలీలతో చేయిస్తున్నారు. తద్వారా పంట పొలాల్లో నిలిచిపోయిన నీటిని పంట బోదెల్లోకి మళ్లించేందుకు అవరోధాలు తొలగిపోతున్నాయి. జిల్లాలో 1,62,626 మీటర్ల పొడవున కాలువలు, బోదెల పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టారు. ప్రతి రోజూ 7,984 మంది ఉపాధి కూలీలు పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
మిచాంగ్ తుపాను సహాయక చర్యల్లో ఉపాధి కూలీలు
పంట కాలువల్లో పూడికతీత ధాన్యం ఆరబోత పనుల్లో నిమగ్నం రైతులపై భారం పడకుండాప్రభుత్వం చర్యలు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ధాన్యం ఆరబోతలోనూ..
పంట కాలువల్లో తూడు తొలగింపు మాత్రమే కాకుండా ధాన్యం రాశుల ఆరబోత పనుల్లోనూ ఉపాధి కూలీల సాయం తీసుకుంటున్నారు. కల్లాలు, రోడ్డు మార్జిన్‌లలో ఆరబోసిన ధాన్యం తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నిమ్ముకున్నాయి. తేమ వల్ల ధాన్యం రవాణాకు ఆటంకం ఏర్పడింది. వాతావరణం పొడిగా, పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అవుతుండటంతో రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు. ఆరబోతకు అయ్యే ఖర్చు రైతులపై భారం పడుతుంది. ఎకరాకు సుమారుగా రూ. 3 వేలు వరకూ పెట్టుబడి పెరిగే పరిస్థితి. ఈ సమస్య నుంచి రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఉపాధి కూలీలతో ధాన్యం ఆరబోత పనులు చేయిస్తుండటంతో ఖర్చులు తగ్గినట్టేనని రైతులు చెబుతున్నారు. ఉపాధి కూలీల సాయంతో త్వరితగతిన ఖరీఫ్ పనులను పూర్తి చేసుకుంటున్నారు.

గొడవర్రులో ధాన్యం రాశిని ఆరబోస్తున్న ఉపాధి కూలీలు
