నలుగురు ‘జీఎస్టీ’ ఉద్యోగులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు ‘జీఎస్టీ’ ఉద్యోగులకు రిమాండ్‌

Jun 2 2023 1:44 AM | Updated on Jun 2 2023 1:44 AM

జీఎస్టీ ఉద్యోగులను రిమాండ్‌పై విజయవాడ కోర్టు నుంచి సబ్‌ జైలుకి తరలిస్తున్న పోలీసులు - Sakshi

జీఎస్టీ ఉద్యోగులను రిమాండ్‌పై విజయవాడ కోర్టు నుంచి సబ్‌ జైలుకి తరలిస్తున్న పోలీసులు

అవినీతి ఆరోపణలపై విజయవాడ మెట్రోపాలిటన్‌ కోర్టులో విచారణ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ అయిన వాణిజ్య పన్నుల శాఖ(జీఎస్టీ) ఉద్యోగులకు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌ గురువారం రిమాండ్‌ విధించారు. వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్‌–1 కార్యాలయం ఇంటెలిజెన్స్‌ విభాగంలో జీఎస్టీ అధికారులుగా పని చేస్తున్న బి.మెహర్‌కుమార్‌, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.వి.చలపతి, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణలు జీఎస్టీ వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పన్నుల శాఖ డెప్యూటీ కమిషనర్‌ మే 31వ తేదీన పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌కమిషనర్‌ టి.కె.రాణా వెంటనే స్పందించి ఏసీపీ స్థాయి అధికారితో విచారణ చేయించారు. డీలర్లు, ఏజెన్సీల నుంచి నలుగురు అధికారులు అక్రమంగా నగదు వసూళ్లు చేస్తున్నారని, వ్యాపారస్తుల నుంచి వసూలు చేసిన జీఎస్టీ నగదును ప్రభుత్వానికి సక్రమంగా చెల్లించడం లేదని, రిజిస్టర్ల నమోదు సక్రమంగా లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కొనసాగించారు. నలుగురు అధికారులు అదే కార్యాలయంలో రెవెన్యూ శాఖలో పని చేసే కె.ఆర్‌.సూర్యనారాయణతో కలిసి అవినీతికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. 2019–2021 మధ్య కాలంలో ఈ నలుగురు ఉద్యోగులు రూ.209 కోట్లు అవినీతికి పాల్పడినట్లు పోలీసులు వివరిస్తున్నారు.

వాడివేడిగా వాదనలు..

నిందితులపై 167, 409, 477(ఎ), 201,420, 384, 120(బి) సెక్షన్లపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట గురువారం హాజరుపర్చారు. సెక్షన్‌ 409 నాన్‌ బెయిల్‌బుల్‌ కావడంతో నిందితుల తరపు న్యాయవాది ఆ సెక్షన్‌ను తొలగించాలని వాదించారు. ఈ కేసులో ప్రాపర్టీ దుర్వినియోగం జరగలేదని, ఈ నేపథ్యంలో 409 తగిన సెక్షన్‌ కాదంటూ వాదించారు. ఈ సెక్షన్‌ను తొలగించి నిందితులకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై హై కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై. నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసుపై ఇటీవల హై కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ముందుంచారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతికి, ఉద్యోగ దుర్వినియోగానికి పాల్పడినట్లు న్యాయమూర్తికి వివరించారు. ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత నిందితులను న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం నిందితులకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో సబ్‌ జైలుకు తరలించారు.

భారీగా అవినీతి!

నలుగురు నిందితులను సమగ్రంగా విచారిస్తే మరింత అవినీతి వెలుగు చూస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ అవినీతి వెనకాల చాలా మంది ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిందితులను పోలీస్‌ కస్టడికి న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు నిందితులతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగి కె.ఆర్‌.సూర్యనారాయణ పాత్ర పైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement