
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..
సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే..
H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం.
మినహాయింపులు వీళ్లకే!
అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.
ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ట్రంప్ ఏమన్నారంటే..
అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మోదీ ఏమన్నారంటే..
ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.

అంత ఫీజు చెల్లించకపోతే..
హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్‌సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు.