సింగపూర్‌లో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

May Day Celebration In Singapore Telugu Samajam In Singapore - Sakshi

సింగపూర్‌లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో మే1న స్థానిక తెరుసన్ రిక్రియేషన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న హాజరయ్యారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తన పాటలతో, వైవిధ్య కళాకారుడు రవి మాయాజాలంతో మంత్రముగ్ధులను చేశారు. 

ప్రత్యేక అతిథిగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరినీ ఒకతాటి మీదకు తీసుకొచ్చి కార్మికసోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపీఎన్‌ఆర్‌టీ ప్రవాస బీమా గురించి వివరించటంతో పాటు, ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వివిధప్రాంతాలకు విమానసర్వీసులకై తన పరిధిలో కృషిచేస్తానని హామి ఇచ్చారు. 

సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, కార్మిక సోదరుల వృత్తి నైపుణ్య పరీక్షలకై తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు. తొలిదశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని ప్రకటించారు. అలాగే సింగపూర్‌లో నివశించే వలస కార్మిక సోదరులను ఆపత్కాలంలో ఆదుకునేలా బీమాతో పాటు ఇతర దీర్ఘకాలిక సౌకర్యాలను కల్పించేలా ఓ ప్రణాళికను సింగపూర్ తెలుగు సమాజం సిద్ధం చేసిందని అన్నారు.

అందుకు భారత దేశ హైకమిషన్‌ సైతం బీమా ప్రయోజనాలు కల్పించేందుకు మొగ్గచూపడం శుభపరిణామమని అన్నారు. విధి విధానాలు సైతం చివరి దశకు వచ్చిందని సింగపూరులో భారత హై కమిషనర్ పెరియసామి కుమరన్ సైతం ఈ కార్యక్రమంలో ప్రకటించారు.  

ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్లు గౌరవ కార్యదర్శి అనిల్  పోలిశెట్టి వెల్లడించారు.

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top