రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.
కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం..
ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా.
కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్‌మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.
నిమిషా ప్రియా పరిస్థితి?
రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు.


