కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం? | Sakshi
Sakshi News home page

కందుల జాహ్నవి కేసు.. ఇదెక్కడి న్యాయం?

Published Thu, Feb 22 2024 9:38 AM

Jaahnavi Kandula Case: No Criminal Charges Against US Cop - Sakshi

కిందటేడాది తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23) అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది కూడా. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

ఆమె మృతికి కారణమైన సదరు పోలీస్‌ అధికారిపై ఎలాంటి కేసు ఉండబోదని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. బుధవారం  వాషింగ్టన్‌ స్టేట్‌లోని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన చేసింది. కందుల జాహ్నవి మృతి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసేదే అయినా..  ఆమె యాక్సిడెంట్‌ కేసులో సియాటెల్‌ పోలీస్‌ అధికారి కెవిన్ డేవ్‌కు వ్యతిరేకంగా సరిపడా ఆధారాలు లేవని, కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్‌ చర్యలు ఉండబోవు’’ అని ఉన్నతాధికారులు అంటున్నారు. 

మరోవైపు.. ఈ ప్రకటనపై జాహ్నవి బంధువులు, పలువురు భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్‌ కెవిన్ డేవ్‌ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తేలినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఆమె మృతిపై అవమానించేలా మాట్లాడిన అధికారి విషయంలోనూ చర్యలు ఏవని ప్రశ్నిస్తున్నారు.

స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్‌ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్‌ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్‌ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు.  కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్ట్ లో పేర్కొన్నారు. 

అయితే కెవిన్‌పై క్రిమినల్‌ చర్యలు లేకపోయినా.. డిపార్ట్‌మెంట్‌ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్‌ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను..  ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

సియాటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ ఆర్డరర్‌ ఆమె మృతిపై చులకనగా మాట్లాడాడు. గిల్డ్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్‌ నవ్వులు చిందించినట్టు రికార్డయింది. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్‌ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అంతేకాదు ఆ తర్వాత దర్యాప్తులోనూ కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు. 

డేనియల్‌ ఆర్డరర్‌ వ్యాఖ్యల వీడియోపై అధికారులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు.  అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని డేనియల్‌ ఆర్డరర్‌ గతంలో వివరణ ఇచ్చాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement