అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు

Hyderabad Man Shot Dead In Chicago While Robbery - Sakshi

షికాగోలో దోపిడీ దొంగల ఘాతుకం

తీవ్రంగా గాయపడ్డ పాతబస్తీవాసి ముజీబుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌/చాంద్రాయణగుట్ట: అమెరికాలోని షికాగో నగరంలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో పాతబస్తీ సంతోష్‌నగర్‌ మోయిన్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ ముజీబుద్దీన్‌(43) గాయపడ్డారు. షికాగోలోని సౌత్‌ మిచిగాన్‌ ఎవెన్యూ 11300 బ్లాక్‌ వద్ద ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) ముజీబుద్దీన్‌ కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి అడ్డగించారు. ముజీబుద్దీన్‌ పర్సు లాక్కుని  కారు కూడా ఇవ్వాలని బెదిరించారు. ముజీబుద్దీన్‌ వారించగా అతనితో కాసేపు పెనుగులాడారు. ఈ క్రమంలో ముజీబుద్దీన్‌పై కాల్పులు జరపడంతోపాటు తలపై తుపాకీతో కొట్టి కారుతో దొంగలు ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. స్థానికులు ముజీబ్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో హాస్పిటల్‌కు తరలించారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు తెలిపారు. ముజీబ్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోతుండగా కొందరు స్థానికులు ఫొటోలు తీశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన షికాగో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

ఇక ఈ దారుణం గురించి ముజీబుద్దిన్‌ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్త రూమ్‌లో ఉండే వ్యక్తి జరిగిన ప్రమాదం గురించి మాకు తెలియజేశాడు. దారుణం గురించి తెలిసి కుప్పకూలిపోయాం. ప్రస్తుతం నా భర్త ఆస్పత్రిలో క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్నారు. తనను చూసుకోవడానికి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మాకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాను. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్‌లని సంప్రదించి నా భర్తకు తగిన వైద్య సాయం అందేవిధంగా చూడాలని కోరాను’ అన్నారు. ఈ ఉదంతాన్ని పాతబస్తీకి చెందిన ఎంబీటీ నేత అంజద్‌ఉల్లాఖాన్‌ షికాగోలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి జై శంకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. (చదవండి: అమెరికాలో శవమై తేలిన యువతి)

కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ముజీబుద్దీన్‌ 2015లో అమెరికాలోని షికాగో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ప్రముఖ స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య అఫ్రోజ్‌ కౌసర్‌తోపాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన కుమారుడు కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ముజీబ్‌ తల్లి షహనాజ్‌ తయ్యబా చెప్పింది. ముజీబ్‌ద్దీన్‌కు వీసా పత్రాల విషయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పటివరకు స్వదేశానికి రాలేని పరిస్థితి నెలకొందని, ఈ ఏడాది జూన్‌లో అతని తండ్రి ముంతజీబ్‌ మరణించినా ఈ సమస్య కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top