
20న పంపా బేస్ వద్ద ప్రపంచ వ్యాప్త పండగ
3 వేల మంది భక్తులకు ప్రత్యేక ఆహ్వానం
ఘనంగా పినరయి సర్కారు ఏర్పాట్లు
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్‌లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది.
ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!
ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం
3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్‌క్లేవ్‌కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్‌లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్‌ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి.
ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్‌లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్‌క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.
ఇప్పుడే ఎందుకు?
ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్‌క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.
ఇదే ప్రధాన లక్ష్యం
శబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్‌లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్‌లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్‌వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.
స్వాగతం ఇలా..
ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.
బాలారిష్టాలెన్నెన్నో..
గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవం
పందళ రాజకుటుంబం దూరం
గ్లోబల్ అయ్యప్ప కాన్‌క్లేవ్‌కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్‌మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్‌ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.
శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ
''గ్లోబల్ కాన్‌క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్‌ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''
అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి
''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''
స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)
''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.''