న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.
ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.

డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు.


